Mamta Banerjee | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. పని చేసేందుకు కేంద్ర యంత్రాంగం అనుమతించడం లేదని ఆరోపించారు. స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ విచారణ కోసం కోల్‌కతా సీబీఐ కార్యాలయానికి తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత అభిషేక్ బెనర్జీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే మమతా ఈ ఆరోపణలు చేశారు. కేంద్రంలోని నిరంకుశ ప్రభుత్వ ఏజెన్సీ పాలన.. మా పనని సవాల్‌గా మార్చిందంటూ ట్వీట్ చేశారు. 34 ఏళ్ల రాక్షస పాలనను మార్చి.. పశ్చిమ బెంగాల్లో ‘మా, మతి, మనుష్’ (తల్లి, భూమి, ప్రజలు) ప్రభుత్వాన్ని ప్రారంభిస్తామని 2011లో ఈ రోజున ప్రమాణం చేశామని మమతా బెనర్జీ మరో ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ రోజు మనం చేసిన ప్రతిజ్ఞను పునరుద్ఘాటిస్తున్నామని, ప్రజల కోసం మనల్ని మనం పునరంకితం చేసుకుంటున్నామన్నారు. పాఠశాల ఉద్యోగాల కుంభకోణం కేసులో టీఎంసీ నాయకుడు, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విచారణ కోసం సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కుంభకోణం విచారణకు సంబంధించి ఇంతకు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టీఎంసీ అగ్రనేతలకు సన్నిహితుడిగా పేర్కొంటున్న సుజయ్ కృష్ణ భద్ర నివాసంపై దాడులు నిర్వహించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.