కోల్‌కతా, మార్చి 17: నాలుగేండ్ల క్రితం ఏపీ సీఎంగా ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాంబు పేల్చారు. ‘పెగాసస్ స్పైవేర్‌ను కొంటారా’ అంటూ ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్వో నుంచి తమ ప్రభుత్వానికి కూడా ఆఫర్ వచ్చిందని పేర్కొన్నారు. రూ.25 కోట్లకే ఆ సంస్థ స్పైవేర్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధపడిందని మమత తెలిపారు. అయితే తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపారు. దేశ రక్షణ కోసం ఉపయోగించాల్సిన స్పైవేర్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయం కోసం వాడుకొన్నదని, జడ్జిలపైన కూడా నిఘా పెట్టిందని మమత ఆరోపించారు. చంద్రబాబు స్పైవేర్ కొన్నారన్న మమత వ్యాఖ్యలను టీడీపీ ఖండించింది.