(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) కంచుకోటను బద్దలు కొట్టిందా? దాదాపు 91 లక్షల ఓటర్లను తొలగించడంతో మమతా బెనర్జీ ఓటు బ్యాంకు గల్లంతయ్యిందా? గత కొంతకాలంగా టీఎంసీ ఆరోపిస్తున్నట్టుగా.. ‘సర్’ ప్రక్రియతో బీజేపీకి లబ్ధి చేకూరిందా? ఓట్లు తొలగించిన నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందన్న గణాంకాలను విశ్లేషిస్తే, ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. ఓట్లు తొలగించిన స్థానాల్లో.. గత ఎన్నికలతో పోలిస్తే, ఈ సారి టీఎంసీ భారీగా సీట్లను కోల్పోగా.. ఇదే సమయంలో ఆ సీట్లు బీజేపీ ఖాతాలోకి మళ్లాయి. దీంతో టీఎంసీ ఓటమిలో ‘సర్’ పాత్ర కీలకంగా మారినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘సర్’తో బీజేపీకి సీట్లు వచ్చాయిలా..
‘సర్’ ప్రక్రియలో ఓట్లు తొలగించిన నియోజకవర్గాల్లో బీజేపీ భారీగా లాభపడినట్టు గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. బెంగాల్లో 25 వేలకు పైగా ఓట్లను తొలగించిన నియోజకవర్గాలు 147 ఉన్నాయి. అయితే తాజా ఎన్నికల్లో ఈ 147 స్థానాల్లో బీజేపీ 95 సీట్లలో విజయం సాధించింది. ఇదే సమయంలో టీఎంసీ కేవలం 51 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌కు ఒక సీటు దక్కింది. ఇక 15 వేల నుంచి 25 వేల మధ్య ఓట్లు తొలగించిన నియోజకవర్గాలు మొత్తం 67 ఉండగా.. ఇందులో బీజేపీ 47 సీట్లను ఖాతాలో వేసుకోగా, టీఎంసీ 19 సీట్లను, కాంగ్రెస్ ఒక సీటును గెలుచుకొంది. 5 వేల నుంచి 15 వేల మధ్య ఓట్లు తొలగించిన స్థానాలు 62 ఉండగా.. అందులో బీజేపీ 50 సీట్లలో విజయం సాధించగా.. మిగిలిన 12 స్థానాలను టీఎంసీ గెలుచుకొన్నది. ఇక 5 వేల లోపు ఓట్లను తొలగించిన నియోజకవర్గాలు 13 ఉండగా.. ఈ మొత్తం స్థానాల్లో బీజేపీనే పాగా వేయడం గమనార్హం.
‘సర్’తో టీఎంసీకి సీట్లు పోయాయిలా..
బెంగాల్లోఅత్యధికంగా ముర్షిదాబాద్ జిల్లాలో 4.55 లక్షల మంది ఓటర్లను సర్ ప్రక్రియలో భాగంగా తొలగించారు. 2021 ఎన్నికల్లో ఆ జిల్లాలో ఉన్న 22 సీట్లలో 20 స్థానాల్లో టీఎంసీ విజయం సాధించగా.. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తొమ్మిది స్థానాలకే మమత పార్టీ పరిమితమయ్యింది. మైనారిటీ ఓట్లను భారీగా తొలగించడమే దీనికి కారణంగా చెప్తున్నారు. ఇక, ఉత్తర 24 పరగణాలు జిల్లాలో 3.25 లక్షల మంది ఓటర్ల పేర్లను ఇటీవల జాబితా నుంచి తొలగించారు. గతంలో ఈ జిల్లాలోని మొత్తం 33 స్థానాల్లో 28 సీట్లను గెలిచిన టీఎంసీ.. ఈసారి కేవలం 8 సీట్ల దగ్గరే ఆగిపోయింది. మాల్దా జిల్లాలో 2.39 లక్షల ఓట్లను తొలగించగా.. అక్కడ గతంలో టీఎంసీ 8 స్థానాలను గెలుచుకోగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది. టీఎంసీ చేజార్చుకొన్న ఈ అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం గమనార్హం. ‘సర్’ ప్రక్రియలో భాగంగా భారీగా ఓటర్లను తొలగించడమే టీఎంసీ ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు పై గణాంకాలను ఉదహరిస్తున్నారు.
‘సర్’తో ఏం జరిగిందంటే?
దీదీ మంత్రివర్గంలో 63 శాతం మంది ఓటమి
బెంగాల్లో మమతా బెనర్జీ క్యాబినెట్ సభ్యుల్లో చాలా మంది ఓటమి చవిచూశారు. స్వయంగా దీదీతో పాటు 63 శాతం మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. మహిళా-శిశు సంక్షేమం, పరిశ్రమలు, విద్యుత్తు, విద్య, రవాణా, వెనకబడిన తరగతులు, ఉత్తర బెంగాల్ అభివృద్ధి తదితర కీలక శాఖల మంత్రులందరూ ఓడిపోయారు. 35 మంత్రుల్లో 22 మంది ఓటమిని చవి చూశారు. ఇందులో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. రాష్ట్ర మంత్రి, ప్రముఖ మైనారిటీ వర్గ నేత, జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధిపతి సిద్ధిఖీ చౌదరిని కూడా ఓటర్లు తిరస్కరించారు.
లాక్డౌన్లో మమత ఇల్లు!
పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్ ఓటమి తర్వాత అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సోమవారం సీఎం మమతా బెనర్జీ కాళీఘాట్‌లోని నివాసం, రాష్ట్ర సచివాలయం వద్ద భద్రతాపరమైన ‘లాక్డౌన్’ విధిస్తూ అధికారులు చర్యలు చేపట్టారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో అధికారిక పత్రాలేవీ బయటకు తీయటం గానీ, వాటిని మార్చటం గానీ, కాపీ చేయటం గానీ చేయరాదంటూ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి దుష్యంత్ నరైన్ ఆదేశాలు జారీచేశారు. సోమవారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే కేంద్ర భద్రతా బలగాల్ని రాష్ట్ర సచివాలయం, సీఎం మమత కాళీఘాట్‌లోని నివాసం వద్ద పెద్ద ఎత్తున మోహరించారు.
