Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం ‘సర్’ పేరిట ఓటర్ల రివ్యూ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, సర్ ద్వారా కలిగిన నష్టంపై వివరించేందుకు, ఫిర్యాదు చేసేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. అక్కడ సీఈసీ జ్ఞానేష్ కుమార్ను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన తమ మాటల్ని వినలేదని, తమను అవమానించారని మమతా బెనర్జీ ఆరోపించారు.
ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. ‘సర్’ వల్ల పశ్చిమ బెంగాల్లో చాలా కుటుంబాలు ఇబ్బందిపడ్డాయనేది మమత వాదన. కొందరు సరైన డాక్యుమెంట్లు ఇవ్వలేకపోవడంతో ఓటరు జాబితాలో పేర్లు కోల్పోయారు. ఇంకొందరి ఓట్లు రకరకాల కారణాల వల్ల తొలగించారు. ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు మమత.. తన టీఎంసీ ఎమ్మెల్యేలతో కలిసి డిల్లీలోని ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి సోమవారం వెళ్లారు. అక్కడ సీఈసీకి పరిస్థితి వివరించేందుకు ప్రయత్నించగా.. ఆయన పట్టించుకోలేదని మమత అన్నారు. తమను అవమానించడంతో బయటకు వచ్చినట్లు ఆమె మీడియాకు తెలిపారు. అయితే, మమత చేసిన ఆరోపణలను ఈసీ వర్గాలు ఖండించాయి. టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో అనుచితంగా ప్రవర్తించారని, సీఈసీ చెప్పేది వినిపించుకోలేదని అధికారులు తెలిపారు. ఈ అంశంపై బీజేపీ కూడా స్పందించింది. మమతా బెనర్జీది అంతా డ్రామా అంటూ కొట్టిపారేసింది.
బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ మమతపై విమర్శలు గుప్పించారు. గంటసేపు ఈసీ ఆఫీసులో ఉండి, మాట్లాడి, సమావేశాన్ని బహిష్కరించానని చెప్పడం ఏంటని ఆయన విమర్శించారు. లోపల జరిగిందొకటి.. బయట మమత చెప్పిందొకటి అన్నారు. డ్రామా నడిపారని, పోలీసుల్ని ఇందులోకి లాగడం సరికాదని సూచించారు. మరోవైపు మమత ప్రశ్నలకు సీఈసీ సరిగ్గానే స్పందించారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.