Mamata Banerjee | కోల్‌కతా: ఆర్జీ కర్ దవాఖాన ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం అనంతరం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, జూనియర్ వైద్యుల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన కొనసాగుతున్నది. దీనికి తెర దించేందుకు చివరి ప్రయత్నం చేస్తున్నానంటూ ముఖ్యమంత్రి మమత బెనర్జీ శనివారం జూనియర్ వైద్యుల ధర్నా స్థలం వద్దకు ఆకస్మికంగా వెళ్లారు.
నిరసనలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, వర్షాలు పడుతూ ఉంటే, డాక్టర్లు రోడ్డు మీద ధర్నా చేస్తుండటం వల్ల తాను 34 రోజుల నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని చెప్పారు. తాను ఓ అక్కగా వచ్చానని, ముఖ్యమంత్రిగా కాదని, అందువల్ల నిరసన తెలుపుతున్నవారి మీద ఎలాంటి చర్యలు తీసుకోనని హామీ ఇచ్చారు.
దీంతో సాయంత్రం మమత నివాసానికి జూనియర్ డాక్టర్లు వెళ్లారు. అయితే ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని వారు పట్టుబట్టారు. ‘ఇంట్లో 40 మందిని కూర్చోబెట్టగలమా? మొత్తం సమావేశాన్ని రికార్డ్ చేస్తున్నాం. దానిని మీకూ ఇస్తాం’ అని చెప్పారు. అయితే తమ వీడియోగ్రాఫర్‌ను సమావేశానికి అనుమతించకపోవడం వల్ల చర్చలు జరగలేదని జూనియర్ డాక్టర్లు తెలిపారు.
డాక్టర్లపై దాడికి కుట్ర?
ధర్నా చేస్తున్న డాక్టర్లపై దాడికి కుట్ర జరిగిందని టీఎంసీ నేత కుణాల్ ఘోష్ ఆరోపించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో ఓ ఆడియో క్లిప్‌ను వినిపించారు. వైద్యులు సీఎంతో సమావేశమయ్యేందుకు వెళ్లినపుడు వారిపై దాడి చేయాలని ఆ ఆడియో క్లిప్‌లో ఉంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తొలుత కేసును విచారించిన ఎస్‌హెచ్‌వోను సీబీఐ శనివారం అరెస్టు చేసింది.
కోల్‌కతాలో బాంబు పేలుడు
శనివారం మధ్యాహ్నం సెంట్రల్ కోల్‌కతాలో ఎస్ఎన్ బెనర్జీ, బ్లోచ్మ్యాన్ కూడలిలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్లాస్టిక్ వస్తువుల్ని సేకరించే 58 ఏండ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.