Mamata Banerjee : బడ్జెట్‌పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) మమతాబెనర్జీ (Mamata Banerjee) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది విజన్, మిషన్, దిశానిర్దేశంలేని బడ్జెట్ అని, పూర్తిగా అబద్ధాలతో నిండి ఉందని ఆమె మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనకు బయలుదేరేముందు కోల్‌కతా విమానాశ్రయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ ద్వారా కేంద్రం దేశ ఆర్థికవ్యవస్థను సర్వనాశనం చేస్తోందని విమర్శించారు.
ఈ బడ్జెట్‌కు ఎలాంటి లక్ష్యం లేదన్నారు. ఇది పూర్తిగా పేదలు, మహిళలు, రైతులు, యువత, సామాన్యులతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు వ్యతిరేకమైనదని మమత మండిపడ్డారు. విద్యా రంగానికి కేటాయింపులు లేవని చెప్పారు. విద్యా సబ్సిడీ, సామాజిక భద్రతా సబ్సిడీ, ఎరువుల సబ్సిడీలను తగ్గించారని అన్నారు. ఈ బడ్జెట్ పూర్తిగా అబద్ధాల కుప్ప అని విమర్శించారు.
పశ్చిమబెంగాల్‌కు కేంద్రం ఒక్క పైసా కూడా కేటాయించలేదని మమతాబెనర్జీ ఆరోపించారు. తమ రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని అన్నారు. జీఎస్టీ రూపంలో మా డబ్బును వాళ్లు తీసుకెళ్లి, తిరిగి వాళ్ల డబ్బు ఇస్తున్నట్టు గొప్పలు చెబుతున్నారని ఎద్దేవాచేశారు. ప్రభుత్వాన్ని నడిపే నైతిక హక్కు వారికి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.