న్యూఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ఓటమిని చూడాలని తాను కోరుకుంటున్నానని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ ఎన్నికల నినాదం ‘ఖేలా హోబ్ ఎగైన్’ను ఆమె మరోసారి తెరపైకి తెచ్చారు. 2022 ఆరంభంలో గోవా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ పతనానికి నాందిపలుకుతాయని అన్నారు.
ఇదే ఒరవడి దేశమంతటా నెలకొని 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పరాజయానికి దారితీస్తుందని దీదీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో బీజేపీ ప్రతిష్ట మసకబారడం ఆరంభమవుతుందని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి కాషాయ పార్టీని మట్టికరిపించేందుకు తృణమూల్ కాంగ్రెస్ చొరవ చూపుతుందని దీదీ గతంలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు రుచించలేదు. కాంగ్రెస్ ప్రమేయం లేకుండా బీజేపీని ఎదుర్కోవడం సాధ్యం కాదని ఆ పార్టీ నేతలు దీదీకి కౌంటర్ ఇచ్చారు.