Mamata Banerjee : పశ్చిమబెంగాల్లో జూనియన్ డాక్టర్లు కొనసాగిస్తున్న నిరసనలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మమతా బెనర్జికి కృతజ్ఞతలు తెలుపుతూ జూనియర్ డాక్టర్లు పంపిన ఈ-మెయిల్‌కు సీఎం కార్యాలయ ప్రతినిధి డాక్టర్ మనోజ్ పండిట్ స్పందించారు. సీఎం నివాసంలో ఈ రాత్రి ఏర్పాటు చేయబోయే సమావేశానికి రావాలని ఆహ్వానించారు.
దాంతో గత కొన్ని రోజులుగా తలెత్తిన ప్రతిష్ఠంభన తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వాతావరణ ప్రతికూల పరిస్థితులను కూడా లెక్కచేయకుండా ముఖ్యమంత్రి తమ నిరసన శిబిరానికి వచ్చి మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ జూనియర్ వైద్యులు ఈ-మెయిల్ పంపారు. దాంతో 15 మంది ప్రతినిధులతో కూడిన జూనియర్ వైద్యుల బృందం చర్చల కోసం కాళీఘాట్‌లోని సీఎం నివాసానికి రావాలని డాక్టర్ పంత్ ఆహ్వానించారు.
కాగా, జూనియర్ వైద్యులు ప్రధానంగా ఐదు డిమాండ్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మెరుగైన వైద్యసేవల కోసం తమ పని పరిస్థితులను (వర్కింగ్ కండిషన్స్) మెరుగుపర్చాలని, ప్రభుత్వ ఆస్పత్రుల దగ్గర భద్రతను పెంచాలని, హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని, ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.