కోల్‌కతా : కరోనా కేసుల పెరుగుదలతో కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (కేఐఎఫ్ఎఫ్) 27వ ఎడిషన్‌ను వాయిదా వేస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ కార్యక్రమం సినిమా హాళ్లలో 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో వర్చువల్ ప్రారంభోత్సవంతో షురూ కానుండగా బెంగాల్ అంతటా కొవిడ్-19 కేసుల పెరుగుదలతో సీఎం మమతా బెనర్జీ ఈ ఈవెంట్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు.
రాష్ట్రంలో ముఖ్యంగా కోల్‌కతా నగరంలో కరోనా పరిస్ధితిని మదింపు చేసిన మీదట సినీ పరిశ్రమలో పలువురు కొవిడ్-19 బారినపడటంతో పౌరులు, సినీ అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల భధ్రత, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను వాయిదా వేయాలని నిర్ణయించామని రాష్ట్ర సమాచార, సాంస్కృతిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించే తదుపరి తేదీని తగిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తుందని పేర్కొంది. 27వ కేఐఎఫ్ఎఫ్ చైర్పర్సన్, సినీ నిర్మాత రాజ్ చక్రవర్తికి మంగళవారం నిర్వహించిన పరీక్షలో కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా వైరస్ సోకడం ఇది రెండోసారి.