Mamata Banerjee : బీజేపీ సర్కారు అమల్లోకి తీసుకురాబోతున్న మూడు నూతన క్రిమినల్ చట్టాలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆ మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయాలని లేఖలో కోరారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు ఈ జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
ఈ నేపథ్యంలోనే మమతాబెనర్జి ప్రధానికి లేఖ రాశారు. కొత్తగా రూపొందించిన క్రిమినల్ చట్టాలను వాయిదా వేయడంవల్ల వీటిపై పార్లమెంటులో సమీక్ష జరిపే అవకాశం ఉంటుందని మమతాబెనర్జి పేర్కొన్నారు. కాగా, బ్రిటిష్కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 చట్టాల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాలను బీజేపీ రూపొందించింది.