బెంగళూరు, అక్టోబర్ 13: ముడా కుంభకోణంలో కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పీకల్లోతు కూరుకుపోయి ఉన్న క్రమంలో కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. పీసీపీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే కుమారుడు, సిద్ధార్ధ విహార్ ట్రస్ట్ చైర్మన్ రాహుల్ ఎం ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. మల్టీ స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చి సెంటర్ ఏర్పాటు చేయడానికి తమ ట్రస్ట్‌కు బెంగళూరులో ఐదు ఎకరాలు కేటాయించాలంటూ కోరుతూ గతంలో చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.
ఈ మేరకు కర్ణాటక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు (కేఐఏడీబీ)కి లేఖ రాశారు. ఖర్గే కుటుంబానికి చెందిన ఈ ట్రస్ట్‌కు గతంలో కేఐఏడీబీ ఐదే ఎకరాల స్థలం కేటాయించగా, దానిని విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఇప్పటికే ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి గతంలో తనకు కేటాయించిన 14 స్థలాలను వెనక్కి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఖర్గే కుమారుడికి ఇలా భూమి కేటాయించడం అధికార దుర్వినియోగం, బంధుప్రీతికి పాల్పడటమేనని బీజేపీ ఎంపీ లాహర్ సింగ్ సిరోయా విమర్శించారు.