న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ప్రధాని నరేంద్ర మోదీకి కౌంటర్ ఇచ్చారు. అదానీ, అంబానీల నుంచి కాంగ్రెస్‌కు టెంపోల నిండా డబ్బులు అంది ఉంటాయన్న మోదీ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. చాలా ధైర్యమైన బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీలను ఎందుకు అరెస్టు చేయలేదు? అని ప్రశ్నించారు. ‘మీరు హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారు. అదానీ, అంబానీలను ఎందుకు అరెస్టు చేయడం లేదు’ అని మల్లికార్జున్ ఖర్గే అన్నట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
కాగా, ప్రధాని మోదీ ప్రభుత్వం పాలసీలు రూపొందించినప్పుడు అదానీ సహా కొంత మంది పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరించినట్లు రాహుల్ గాంధీ విమర్శించారు. రైతుల సంక్షేమాన్ని పణంగా పెట్టి పారిశ్రామికవేత్తల రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిందని గతంలో ఆరోపించారు.
మరోవైపు ఇటీవల తెలంగాణాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్ యువరాజు ఐదేళ్లుగా పదే పదే ఒక విషయం చెబుతున్నారు. రాఫెల్ ఇష్యూ తెరమరుగయ్యాక ఐదుగురు పారిశ్రామిక వేత్తలను, ముఖ్యంగా అంబానీ, అదానీలను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే వారిపై దాడులు చేయడం మానేశారు. కాంగ్రెస్‌కు టెంపో లోడ్లు (కరెన్సీ) చేరాయా? అని నేను అడగాలనుకుంటున్నా. రాత్రికి రాత్రే అంబానీ, అదానీపై యువరాజు ఆరోపణలు ఆగిపోవడానికి ఏ డీల్ జరిగింది’ అని మోదీ ప్రశ్నించారు.