న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ బుధవారం మూడో రోజూ ప్రశ్నించిన క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనలకు దిగిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ సహా ఆ పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ పోలీసులు కాషాయ పార్టీ ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ కార్యాలయంలోకి ప్రవేశించిన పోలీసులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకువచ్చి కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆ పార్టీ నేతలు కోరారు.
పోలీసుల దమనకాండను నిరసిస్తూ గురువారం అన్ని రాష్ట్రాల రాజ్భవన్లను కాంగ్రెస్ నేతలు ముట్టడిస్తారని, మరుసటిరోజు జిల్లా స్ధాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ పేర్కొంది. మరోవైపు తాము కాంగ్రెస్ కార్యాలయంలో అడుగుపెట్టలేదని ఆ పార్టీ కార్యకర్తలు బారికేడ్లను ధ్వంసం చేసి చొచ్చుకురావడంతోనే అడ్డగించామని ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ (శాంతి భద్రతలు) ఎస్పీ హుదా వివరించారు. తాము కాంగ్రెస్ కార్యకర్తలపై ఎలాంటి బలప్రయోగం చేయలేదని తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.