రాంచీ : పహల్గాం ఉగ్ర దాడి జరగడానికి మూడు రోజుల ముందు అక్కడ దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రధానికి ఇంటెలిజెన్స్ నివేదిక అందిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ఆరోపించారు. అందుకే ప్రధాని తన కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని తెలిపారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే పహల్గాం మారణ కాండ జరిగిందని కేంద్రం అఖిల పక్ష సమావేశంలో ఒప్పుకొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఖర్గే గుర్తు చేశారు. ‘మీ భద్రత దృష్ట్యా మీరు కశ్మీర్లో పర్యటించడం క్షేమకరం కాదని మీకు తెలిసినప్పుడు.. అదే విషయాన్ని మీరు స్థానిక కశ్మీర్ బలగాలకు చెప్పి ప్రజలను ఎందుకు రక్షించలేదు? పర్యాటకుల భద్రత కోసం మరిన్ని బలగాలను ఎందుకు పంపలేదు?’ అని ఖర్గే ప్రధాని మోదీని ప్రశ్నించారు.