Mallikarjun Kharge : కాంగ్రెస్ (Congress) పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దాని ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ముడి చమురు ధరలు 42 నెలల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయని అన్నారు. ఈ మేరకు పలు మీడియా సంస్థలు వెల్లడించిన నివేదికలను ఆయన ఉటంకించారు.
బీజేపీ ప్రభుత్వం ఇంకెన్నాళ్లు ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడుతూ వారిని దోచుకుంటుందని మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. ముడి చమురు ధరలు నిరంతరం తగ్గుతూనే ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గట్లేదని విమర్శించారు. మే 2014 నుంచి సుమారు 34 శాతం వరకు ముడి చమురు ధరలు తగ్గాయని చెప్పారు. పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.36 లక్షల కోట్ల పన్ను వసూలు చేసిందని ఆరోపించారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంకా ఈ దోపిడీ ఎంతకాలం కొనసాగుతుందని ఖర్గే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో అమల్లోకి తేనున్న లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మాట్లాడుతూ.. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని అన్నారు. దేశ వనరులు, పాలనలో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం ఉండాలన్నారు.
జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయడంవల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, ఉత్తరాదిలో ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. దాంతో దేశంలో సమన్యాయం లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. అలాంటివి జరగకుండా సామాజిక సమానత్వం కోసం అందరు కలిసికట్టుగా పోరాడాలని మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు.