Mallikarjun Kharge | న్యూఢిల్లీ, నవంబర్ 29: కాంగ్రెస్ పార్టీలో క్రమ శిక్షణ లోపించడం పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన క్రమంలో ఢిల్లీలో శుక్రవారం సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉత్సాహంతో పునరాగమనం చేసిందని, అయితే మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీని నిరాశ పరిచాయని అన్నారు. పార్టీ ప్రక్షాళన అవసరమని పేర్కొన్నారు. పార్టీలో ఐక్యత లేకపోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వంటి అంశాలు ఎన్నికల్లో బాగా దెబ్బ తీశాయని ఆయన చెప్పారు.
ఈవీఎంలు ఎన్నికల ప్రక్రియను అనుమానాస్పదంగా మార్చేశాయని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా ఈసీ వ్యవహరించాలని ఆయన కోరారు. పార్టీని బలోపేతం చేయడానికి కింది నుంచి ఏఐసీసీ స్థాయి వరకు మార్పులు తీసుకురావాలని అన్నారు.