Basavaraj Bommai | పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు భారీగా పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయిందని కర్ణాటక మాజీ సీఎం బస్వరాజ్ బొమ్మై పేర్కొన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం సిద్ధరామయ్య తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని దావణగిరె బీజేపీ కార్యాలయం నుంచి ఏసీ కార్యాలయం వరకూ జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరల పెంపుతో సామాన్యుల జీవితాలు దారుణంగా మారాయన్నారు. పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వ పాలన సాగించే నైతిక అర్హత కోల్పోయారన్నారు. సీఎం సిద్ధ రామయ్య రాజీనామా చేయాలన్నారు.
త్వరలోనే కర్ణాటకలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని బసవరాజు బొమ్మై తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాలనతో పరిస్థితులు దారుణంగా మారాయన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తిరగబడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నిధుల కొరతతో ఎమ్మెల్యేలు ప్రజల ముందుకు వెళ్లడానికే భయ పడుతున్నారన్నారు. పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, ప్రభుత్వాదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇదే పరిస్థితులు కొనసాగితే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అన్న అనుమానం కలుగుతుందన్నారు.