న్యూఢిల్లీ: హత్రాస్ తొక్కిసలాటకు (Hathras stampede) కారణమైన ప్రధాన నిందితుడు దేవ్‌ప్రకాశ్ మధుకర్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. ఈ నెల 2న హత్రాస్ సత్సంగ్ కార్యక్రమానికి దేవ్‌ప్రకాశ్ ఆర్గనైజర్‌గా ఉన్నాడు. తొక్కిసలాట ఘటన తర్వాత అతడు పరారయ్యాడు. అప్పటినుంచి తప్పించుకుతిరుగుతున్న ఆయన తాజాగా ఢిల్లీలో పోలీసుల ముందు లొంగిపోయారు. అనంతరం అతడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారని దేవ్‌ప్రకాశ్ తరపు న్యాయవాది ఏపీ సింగ్(AP Singh) తెలిపారు. ఈమేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
హత్రాస్ సమావేశానికి దేవ్‌ప్రకాశ్ మధుకర్ ప్రధాన ఆర్గనైజర్‌గా ఉన్నారు. అతను ఏ నేరం చేయలేదు. అతను ఇప్పుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆయన ఒక హార్ట్ పేషెంట్. అతనికి ఏమీ జరగకూడదు. తాము ఎటువంటి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లం. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. అయితే నిందితుడు లొంగిపోయిన విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.
అసలేం జరిగిదంటే..
జూలై 2న భోలే బాబా (Bhole Baba) అనే పేరుతో ప్రాచూర్యం పొందిన ఓ ఆధ్యాత్మికవేత్త హత్రాస్ జిల్లాలోని ఫూల్రాయ్ గ్రామంలో ‘సత్సంగ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు, అనుచరులు హాజరయ్యారు. వారిని ఉద్దేవించి భోలే బాబా తన ప్రవచనాన్ని ఇచ్చారు. కార్యక్రమం పూర్తవుతుండగా ఒక్కసారిగా పెనుగులాట చోటుచేసుకుంది. భోలే బాబా పాదాలను తాకాలని భక్తులు పరుగెత్తారు.
దీంతో అనేక మంది కింద పడిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కింద పడ్డ వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఊపిరి అందక ఆర్తనాదాలు చేస్తూ చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 121 మంది మరణించారు. తొక్కిసలాటపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ న్యాయ విచారణకు ఆదేశించారు. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారు సాక్ష్యాలను దాచిపెట్టారని, నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ ప్రమాదానికి కారణమైన భోలే బాబా పరారీలో ఉన్న విషయం తెలిసిందే.