Maharashtra Elections | ముంబై, అక్టోబర్ 23: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటములు వ్యూహాలకు పదునుపెట్టాయి. రెండు కూటముల్లో సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వస్తున్నది. అభ్యర్థుల ప్రకటనతో ప్రచార పర్వం ఊపందుకుంటున్నది. ఈ క్రమంలో ఉత్తర మహారాష్ట్రలో ఈ సారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నదానిపై అందరి దృష్టి నెలకొంది. తమకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో పట్టు నిలుపుకునేందుకు అధికార బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అయితే ఈసారి ఎలాగైనా ఆధిక్యం సాధించాలని కాంగ్రెస్ కూటమి ప్రణాళికలు రచిస్తున్నది. 47 సీట్లతో ప్రధానంగా వ్యవసాయ ఆధారితంగా ఉన్న ఈ ప్రాంతంలో రైతుల ప్రాబల్యం ఎక్కువ. ధులే, నందుర్బార్, జల్గావ్, నాసిక్, అహల్యానగర్ జిల్లాలు ఈ ప్రాంతం కిందకు వస్తాయి.
2019 ఎన్నికల్లో మొత్తం 47 సీట్లలో బీజేపీ 16, అవిభాజిత నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 13, కాంగ్రెస్ ఏడు, అవిభాజిత శివసేన ఆరు, ఏఐఎంఐఎం రెండు, స్వతంత్రులు ఇద్దరు, క్రాంతికారీ షెత్కారీ పక్ష్ ఒక స్థానం గెల్చుకున్నాయి. అనంతరం రాజకీయంగా ప్రధాన పార్టీల్లో పెను మార్పులు చోటుచేసుకోవడంతో అప్పటి పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశాలు కన్పించడం లేదు.
చీలిక అనంతరం రాజకీయంగా పెనుమార్పులు
2022 జూన్‌లో శివసేన, 2023 జూలైలో ఎన్సీపీల్లో చీలిక వచ్చింది. శివసేన చీలిక వర్గానికి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ చీలిక వర్గానికి అజిత్ పవార్ నేతృత్వం వహించగా, వారిద్దరూ ప్రస్తుతం బీజేపీ కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్‌పవార్), కాంగ్రెస్ మహావికాస్ అఘాడీగా ఉన్నాయి. ఈ రాజకీయ చీలిక అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయి. ప్రధాన పార్టీలను చీల్చడాన్ని ప్రజలు ఇష్టపడలేదని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 12 సీట్లలో బీజేపీ నాలుగింటిని కోల్పోయింది. ధులే, దిండోరి, నందుర్బార్, అహల్యానగర్లను శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) కూటమి గెల్చుకోగా, జల్గావ్, రావెర్ స్థానాలను బీజేపీ నిలబెట్టుకుంది.
బీజేపీపై వ్యతిరేకత
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు సమస్యలు, మరాఠా-ఓబీసీ ఆందోళనలు ప్రధాన అంశాలుగా నిలిచినట్టు రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 1999లో కాంగ్రెస్ నుంచి శరద్‌పవార్ వేరుపడిన తర్వాత నాసిక్ ప్రాంతంలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిందని ఆ పార్టీ సీనియర్ నేత రాజారామ్ పంగ్వానే తెలిపారు. ప్రస్తుతం తాము నాసిక్‌లో పోటీ చేయడం లేదని, అక్కడ సేన-ఎన్సీపీతో బీజేపీ పోటీ పడుతుందని చెప్పారు. అయితే తాము నందుర్బార్, ధులే, అహల్యానగర్లపై దృష్టి సారించినట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం, అవినీతి, మరాఠా-ఓబీసీ అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నట్టు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ పరిస్థితిలో ఏమీ మార్పు లేదని, ఆ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని, అయితే బీజేపీ నిర్వహణా సామర్థ్యం కారణంగా ఆ పార్టీకి ఎడ్జ్ ఉందని ఎన్పీసీ (శరద్‌పవార్) సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే తెలిపారు.
రైతుల్లో అసంతృప్తి
ఉల్లిగడ్డల ఎగుమతిపై నిషేధం తొలగించినప్పటికీ రైతుల పరిస్థితిలో ఏమీ మార్పు రాలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వారు తీవ్రంగా నష్టపోయారు. పత్తి, సోయాబీన్‌కు సరైన ధరలు రాలేదు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి ఉల్లి రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మహారాష్ట్ర స్టేట్ ఆనియన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భరత్ గిగ్హోల్ తెలిపారు. వారికి రూ.25 కోట్ల సబ్సిడీ మొత్తం ఇంకా అందాల్సి ఉందన్నారు. ఎగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించాలని కోరుతున్నారన్నారు. సోయాబీన్‌కు కనీస మద్దతు ధర కన్నా తక్కువే లభించడం పట్ల రైతులు అసంతృప్తి చెందుతున్నారు.