Sanjay Raut : మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా, మహాయుతి కూటమి ఫుల్ మెజారిటీ సాధించినా ఇంకా ముఖ్యమంత్రిని ఎందుకు ఎంపిక చేయడం లేదని ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కూటమి నేతలు తమ ముఖ్యమంత్రిని ఎందుకు ఎంపిక చేయలేదని రౌత్ నిలదీశారు.
అదేవిధంగా మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై కూడా సంజయ్ రౌత్ మండిపడ్డారు. శివసేన పేరుతో ఏక్నాథ్ షిండే బాలాసాహెబ్ పేరును రాజీకీయాలకు వాడుకుంటున్నారని, కానీ ఆయన పార్టీకి సంబంధించిన నిర్ణయాలు మాత్రం ఢిల్లీలో జరుగుతున్నాయని విమర్శించారు. బాలాసాహెబ్ పేరుతో నిర్ణయాలు జరగాల్సింది ఢిల్లీలో కాదని, ముంబైలో అని అన్నారు.
బాలాసాహెబ్ థాకరే ఎన్నడూ బీజేపీ నేతలను కలవడం కోసం ఢిల్లీకి వెళ్లలేదని, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ లాంటి నేతలే ఆయనను కలిసేందుకు ముంబైకి వచ్చేవారని చెప్పారు. అసలైన శివసైనికులుగా తామెన్నడూ ఢిల్లీకి వెళ్లి వాళ్లను (బీజేపీ నేతలను) భిక్షమడగలేదని ఎద్దేవా చేశారు.