న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పనులు లేని కాలంలో జీవనోపాధి కల్పించే లక్ష్యంతో రూపొందిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని(నరేగా) కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తూ వ్యవసాయ కూలీలకు వెతలు మిగులుస్తోందని ప్రతిపక్ష పార్టీలు, హక్కుల కార్యకర్తలతోపాటు ఆర్థికవేత్తలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. బడ్జెట్ కోతలు, పాలనాపరమైన మార్పులు, సైద్ధాంతిక నిర్లక్ష్యం కలబోసుకున్న మోదీ ప్రభుత్వ వైఖరి ఉపాధి హామీ పథకం లబ్ధిదారులను నిలువునా దగా చేస్తోంది. ఏడాదికేడాది ఉపాధి హామీ పథకం కోసం బడ్జెట్ కేటాయింపులకు కోత పెడుతున్నది.
ఉదాహరణకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో నరేగాకు రూ. 60,000 కోట్లు కేటాయింపులు జరిగాయి. అంతకుముందు ఏడాది సవరించిన బడ్జెట్ కేటాయింపులు రూ. 73,000 కోట్లు ఉండగా పెరగాల్సిన కేటాయింపులపై కోత పడింది. అనుబంధ కేటాయింపులలో తరచూ జరుగుతున్న జాప్యం కూడా వ్యవసాయ కూలీలను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీస్తోంది. వ్యవసాయ ఆఫ్ సీజన్ ముగిసిన తర్వాత అనుబంధ కేటాయింపులు జరగడం వల్ల లక్షలాది మంది కూలీలు ఉపాధి పొందలేక పోవడం, సకాలంలో వేతనాలు లభించకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వేతనాల చెల్లింపులో జాప్యం కారణంగా వేతన బకాయిలు భారీగా పెరిగిపోయి నరేగాపై వ్యవసాయ కూలీలలో నమ్మకం, ఆసక్తి సన్నగిల్లుతోంది. ఉపాధి హామీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి సెప్టెంబర్ 5తో 20 ఏండ్లు పూర్తవుతుంది.
మోదీ ప్రభుత్వంలో ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యాలు నిత్యకృత్యంగా మారాయి. వేతనాల కోసం వారాలు లేదా నెలల తరబడి వ్యవసాయ కూలీలు ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అయితే సంబంధిత మంత్రిత్వశాఖ మాత్రం తమ జాప్యాన్ని ఒప్పుకోకుండా నిందను రాష్ర్టాలపై వేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. 2022లో లిమ్టెక్ ఇండియా అనే స్వతంత్ర సంస్థ దీనిపై అధ్యయనం చేసి చట్టపరంగా తప్పనిసరిగా 15 రోజుల్లో వేతనాలు చెల్లించాల్సి ఉండగా 71 శాతం వేతనాలలో తీవ్ర జాప్యం జరిగినట్లు వెల్లడించింది. వేతనాల చెల్లింపులో ఆలస్యం కారణంగా అప్పటికే ఆర్థికంగా చితికిపోయి ఉన్న వ్యవసాయ కూలీలు మరింత దుస్థితిలోకి కూరుపోతున్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగా నరేగా అసలు లక్ష్యమే దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని కల్పించాలని చట్టం చెబుతోంది. అయితే వాస్తవ పరిస్థితులు చూస్తే సగటున ఏడాదికి 40-50 రోజులకు మించి పని కల్పించడం లేదు. కొన్నిసార్లు పనులు ఉన్నప్పటికీ 25 శాతం మంది కూలీలకు పని కల్పించడం లేదు. ఇందుకు కారణం నిధుల కొరత లేదా పాలనాపరమైన నిర్లక్ష్యమని తెలుస్తోంది. దీంతో లక్షలాది మంది కూలీలు, మహిళలు జీవనోపాధి లేక ఆకలి కేకలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
నిధుల విడుదల, జాబ్ కార్డు తనిఖీలపై కేంద్రం పెత్తనం పెరిగిపోవడంతో స్థానిక పాలనా యంత్రాంగం చేతులు ముడుచుకుని కూర్చోవలసి వస్తోంది. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్ఎంఎంఎస్) ద్వారా ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ(ఏబీపీఎస్), డిజిటలైజ్డ్ హాజరుని ప్రవేశపెట్టిన కారణంగా గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ మౌలిక సౌకర్యాల లేమితో లక్షలాది మంది వ్యవసాయ కూలీలకు ఉపాధి దక్కడం లేదు. సాంకేతిక సమస్యలు, స్మార్ట్ఫోన్లు లేకపోవడం, బయోమెట్రిక్ తేడాల వల్ల అర్హులైన లక్షలాది కూలీలు ఉపాధిని కోల్పోతున్నారు.
2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ 2015లో నరేగాను ప్రస్తావిస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి చిహ్నంగా అభివర్ణించారు. దీన్ని ఆర్థిక విధానంగా గుర్తించని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం గతానికి చెందిన చేదు గుర్తుగా పరిగణిస్తోంది. కొవిడ్ అనంతర కాలంలో దీన్ని బలోపేతం చేయడం పట్ల కేంద్రం ఏనాడూ శ్రద్ధ చూపించ లేదు. దీంతో అధికార యంత్రాంగం, విధానకర్తల నుంచి సంస్థాగతంగా ఎటువంటి మద్దతు, ప్రోత్సాహం ఈ పథకానికి లభించడం లేదు.
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలలో నరేగా నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు మోదీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అవినీతి, పెండింగ్ ఆడిట్ల సాకుతో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు తదితర రాష్ర్టాలకు నరేగా నిధులను విడుదల చేయకుండా ఆపుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. నిధులను కేంద్రం తొక్కిపెట్టిన కారణంగా 2023లో పశ్చిమ బెంగాల్లోని నరేగా కూలీలకు ఒక్కపైసా చెల్లింపు జరగలేదు. నరేగా నిధుల విడుదలలో ప్రతిపక్ష పాలిత రాష్ర్టాలపై నరేంద్ర మోదీ సర్కార్ వివక్షను ప్రదర్శిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు ముఖ్యమంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు.