ముంబై : బీజేపీ పాలిత మహారాష్ట్రలో ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’ పథకం తీవ్ర వివాదాస్పదం అవుతున్నది. ఈ పథకంలో రూ.3 వేలకోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే కాగ్ నివేదిక ఇచ్చింది. ఇప్పుడు మరో వివాదం తెరమీదికి వచ్చింది. ఈ పథకం నుంచి ఇప్పటి వరకు ఏకంగా 92 లక్షల మందిని తొలగించారు.
కొన్ని రోజుల క్రితమే ఈ పథకం నుంచి 80 లక్షల మందిని తీసేయగా.. ఇప్పుడు ఒకేసారి 12 లక్షల మందిని తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పథకానికి 2.4 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 50 లక్షల నుంచి 55 లక్షల మంది వరకు సరైన సమయంలో ఈ-కేవైసీ పూర్తి చేయడంలో విఫలం కావడంతో తొలగించినట్టు ప్రభుత్వం తెలిపింది. అంతే కాకుండా కేవలం మహిళల కోసమే తెచ్చిన ఈ పథకం కోసం 14వేల మంది పురుషులు దరఖాస్తు చేసుకుంటే వారిని కూడా తొలగించామని ఫడ్నవీస్ ప్రభుత్వం చెప్పింది.