అలీబాగ్ : మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని అలీబాగ్ తెల్ల ఉల్లిపాయకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (Geographical Indication) లభించింది. దీంతో పంటకు ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు విస్తృత మార్కెట్ అవకాశాలు వస్తాయని వ్యవసాయాధికారులు తెలిపారు. అలీబాగ్ ఉల్లిపాయలో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. గుండె జబ్బుల చికిత్సకు, కొలెస్ట్రాల్ నియంత్రణకు, ఇన్సులిన్ తయారీకి వినియోగిస్తారని.. ఈ ఉల్లిపాయను 1883 నాటికే అధికారిక గెజిట్‌లో పేర్కొన్నట్లు చెప్పారు.
ఇక్కడి వ్యవసాయశాఖతో పాటు కొంకణ్ వ్యవసాయ విద్యాలయం సంయుక్తంగా జనవరి 15, 2019న జియోగ్రాఫికల్ ఇండికేషన్ కోసం దరఖాస్తును సమర్పించాయి. గత నెల 29న పేటెంట్ రిజిస్ట్రా ముంబై కార్యాలయంలో ప్రతిపాదనను పరిశీలించి, అలీబాగ్ ఉల్లిపాయకు జీఐ ట్యాగ్‌ను ఇవ్వాలని నిర్ణయించారని ఓ అధికారి తెలిపారు. ఎకరా విస్తీర్ణంలో సగటున రూ.2లక్షల ఆదాయం వస్తుందని ఆ అధికారి వివరించారు.