ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వారం చివర్లో కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ అనంతరం మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 46,723 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,40,122కు పెరిగింది. గత 24 గంటల్లో 28,041 మంది కోలుకోగా 32 మంది రోగులు మరణించారు.
ఒక్క ముంబైలోనే కొత్తగా 16,420 కరోనా కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయి. ముంబైలో మొత్తం కరోనా కేసులు 9,56,287కు, మొత్తం మరణాల సంఖ్య 16,420కి చేరింది. ముంబైలోనే 1,02,285 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 14,649 మంది కోలుకున్నారు.
మరోవైపు మహారాష్ట్రలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 86 కేసులు నమోదయ్యాయి. పూణేలో 53, ముంబైలో 21, పింప్రి-చించ్వాడ్లో 6, సతారాలో 3, నాసిక్‌లో 2, పూణె రూరల్‌లో 1 చొప్పున ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,367కు పెరిగింది.