ముంబై: మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలేను ఆ రాష్ట్రమంత్రి అబ్దుల్ సత్తార్ దుర్భాషలాడారు. శివసేన రెబల్ గ్రూప్ షిండే వర్గానికి చెందిన ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా సహనం కోల్పోయారు. రూ.50 కోట్లు అందుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించడంతో ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేను ఆయన దుర్భాషలాడారు. ఆమెతోపాటు మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడారు.
కాగా, మంత్రి అబ్దుల్ సత్తార్పై ఎన్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబైలోని బోరివాలి పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేసింది. దేశంలోని మహిళందరినీ ఆయన అవమానించారని అందులో ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంత్రి అబ్దుల్ సత్తార్పై చర్యలు తీసుకోవాలని, మంత్రి పదవికి ఆయాన రాజీనామా చేయాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది.
మరోవైపు ఎన్సీపీ నిరసనలపై శివసేన షిండే వర్గం క్షమాపణలు చెప్పింది. ఆ వర్గం ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే అంటే తమకు గౌరవమని అన్నారు. మంత్రి అబ్దుల్ సత్తార్ తరుఫున క్షమాపణలు చెప్పుతున్నట్లు తెలిపారు. అయితే మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయబోరని స్పష్టం చేశారు.