
ముంబయి : దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇవాళ జింబాబ్వే నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వచ్చిన వ్యక్తి సైతం ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు గుర్తించారు. రెండు రోజుల కిందట 72 సంవత్సరాల వ్యక్తి జామ్‌నగర్‌కు రాగా.. విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించగా.. కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పుణె ల్యాబ్‌కు పంపగా.. కొత్త వేరియంట్ బారినపడ్డట్లు గుర్తించారు. సదరు వ్యక్తి కాంటాక్టులుగా ఉన్న పది మందిని క్వారంటైన్‌కు తరలించారు.
సదరు వ్యక్తిని జామ్‌నగర్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. తాజాగా దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. ముంబై శివారు కల్యాణ్ డోంబివాలి మున్సిపల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించాడని మహా ఆరోగ్యశాఖ డైరెక్టర్ తెలిపారు. సదరు వ్యక్తికి 33 సంవత్సరాల వయసు ఉంటుందని, దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నుంచి దుబాయి, ఢిల్లీ మీదుగా ముంబైకి వచ్చాడని పేర్కొన్నారు. వైరస్ బారినపడ్డ వ్యక్తి కొవిడ్ టీకా తీసుకోలేదని తెలుస్తోంది. ఇవాళ నమోదైన రెండు కేసులతో మొత్తం కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది. రోజు రోజుకు దేశంలో కొత్త వైరస్ కేసులు వెలుగు చూస్తుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.