Crime news : నదిలో విషం పోస్తుండగా అడ్డుకున్న వ్యక్తిని ముగ్గురు దుండగులు కొట్టిచంపారు. మహారాష్ట్ర (Maharastra) లోని పాల్ఘర్ జిల్లా (Palgarh district) లో ఈ దారుణం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్స్ (Mobile Phones) ను ట్రాక్ చేసి నిందితులను పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా మొఖాడా తాలూకా సాటుర్లీ గ్రామానికి చెందిన నవాసు లడ్క్యా.. ఓ ముగ్గురు వ్యక్తులు చేపలు పట్టడం కోసం నదిలో విషం పోస్తుండగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. దాంతో వారు అతడిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అతడిని ఊళ్లోకి తీసుకెళ్లి కూడా తాళ్లతో కట్టి చనిపోయేదాకా కొట్టారు.
ఈ ఘటనపై బాధితుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం మొబైల్ ఫోన్స్ ఆధారంగా ట్రాక్ చేసి 12 గంటల లోపల నిందితులను అదుపులోకి తీసుకున్నారు.