FASTag : దేశంలోని టోల్ ప్లాజాల (Toll plazas) లో టోల్ ట్యాక్స్ (Toll tax) చెల్లించడానికి ఫాస్టాగ్ (FASTag) లను వినియోగిస్తున్నారు. వాహనానికి ఫాస్టాగ్ అంటించి ఉంటే టోల్ ప్లాజాల దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదు. వాహనానికి అంటించి ఉన్న ఫాస్టాగ్ స్టిక్కర్ అటోమేటిక్‌గా స్కాన్ అవుతుంది. వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి టోల్ రుసుము నేరుగా డిడక్ట్ అయ్యి టోల్ ప్లాజా ఖాతాలో చేరుతుంది.
ఫాస్టాగ్‌ల ద్వారా కాకుండా నగదు రూపంలో టోల్ ఫీజు చెల్లించాలంటే ఒక్కో వాహనదారుడికి కనీసం ఒక నిమిషం సమయం పడుతుంది. దాంతో వాహనాదారులు బారులు తీరి చాలాసేపు వేచిచూడాల్సి వస్తుంది. అందుకే ఫాస్టాగ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి టోల్ ప్లాజాల దగ్గర రద్దీ కొంతమేరకు తగ్గింది. అయితే అందరూ ఫాస్టాగ్‌లను తీసుకోకపోవడంతో పూర్తిగా రద్దీ తగ్గడం లేదు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల దగ్గర నగదు చెల్లింపుల కోసం వాహనాల క్యూలైన్లు లేకుండా చేయడం కోసం.. పూర్తిస్థాయిలో ఫాస్టాగ్‌లను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. అంటే అన్ని వాహనాల యజమానులు ఫాస్టాగ్‌లను తీసుకోవడం తప్పనిసరి చేసింది. దాంతో టోల్ ప్లాజాల దగ్గర నగదు చెల్లింపులకు ఫుల్స్టాప్ పెట్టబోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నూతన నిబంధనను అమల్లోకి తేనున్నట్లు ప్రకటించింది.