ముంబై: మహారాష్ట్రలో వరుసగా రెండో రోజు కూడా 40 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 41,434 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక్క ముంబైలోనే 20,318 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,73,238కి పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 13 మంది కరోనాతో మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,41,627కు చేరింది. శనివారం 9,671 మంది కరోనా రోగులు కోలుకున్నారు.
కాగా, మహారాష్ట్రలో కొత్తగా 133 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య వెయ్యి దాటి 1,009కి చేరింది. కరోనా కేసులు మరింతగా విజృంభిస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎలాంటి కదలికలను అనుమతించబోమని, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని పేర్కోంది.
సోమవారం నుంచి జిమ్‌లు, బ్యూటీ సెలూన్లు, వినోద పార్కులు, జంతు ప్రదర్శనశాలలు, మ్యూజియంలు, ఇతర పర్యాటక ప్రదేశాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాళ్లు సగం సామర్థ్యంతో పని చేస్తాయని చెప్పింది. కాగా, స్కూళ్లు, కాలేజీలను ఫిబ్రవరి 15 వరకు మూసివేయనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పేర్కొంది.