Belagavi | బెంగళూరు/ ముంబై, ఫిబ్రవరి 23: ‘బెళగావి’పై కర్ణాటక, మహారాష్ట్ర మధ్య మళ్లీ చిచ్చు రేగింది. రెండు రాష్ర్టాల మధ్య ఏండ్లుగా నడుస్తున్న సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మరాఠీలో బదులివ్వనందుకు శుక్రవారం బెళగావిలో కర్ణాటకకు చెందిన ఓ కండక్టర్ను చితకబాదారు. ఇందుకు ప్రతిగా శనివారం కర్ణాటకలోని చిత్రదుర్గలో మహారాష్ట్రకు చెందిన కండక్టర్పై కొందరు దాడి చేసి, నల్ల రంగు పూశారు. ఈ రెండు దాడులతో రెండు రాష్ర్టాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ముందు జాగ్రత్త చర్యగా ఇరు రాష్ర్టాల మధ్య బస్సు సర్వీసులను నిలిపివేశారు.
బెళగావిలో శుక్రవారం కర్ణాటక కండక్టర్పై జరిగిన దాడి తాజా ఉద్రిక్తతలకు కారణమైంది. ప్యాసింజర్కు మరాఠీలో బదులివ్వనందుకు కొందరు కండక్టర్పై దాడి చేశారు. కండక్టర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓ బాలిక తనకు టికెట్ కావాలని మరాఠీలో అడిగింది. అయితే తనకు మరాఠీ రాదని, కన్నడలో చెప్పాలని కండక్టర్ చెప్పడంతో బాలిక, ఆమెతో పాటు వచ్చిన వ్యక్తి తనపై దాడి చేశారని కండక్టర్ తెలిపారు. ఈ క్రమంలో కొందరు బస్సును ఆపి, కండక్టర్పై దాడి చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కండక్టర్పై కూడా పోక్సో కేసు నమోదైంది. తనపై అనుచితంగా ప్రవర్తించారని బాలిక ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు ప్రతీకార చర్యగా కర్ణాటకలోని చిత్ర దుర్గ జిల్లాలో మహారాష్ట్రకు చెందిన కండక్టర్పై కొందరు దాడి చేసి ఇంకు పూశారు. ఘటనకు సంబంధించి పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కండక్టర్పై దాడి ఘటన నేపథ్యంలో కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్టు మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రకటించారు. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న బస్సుపై చిత్రదుర్గలో కొందరు దాడి చేశారని చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం మహారాష్ట్రలో కర్ణాటక బస్సుపై దాడి జరిగింది. బస్సుపై జై మహారాష్ట్ర, జై మరాఠీ, జై నవనిర్మాణ సేన అంటూ నినాదాలు రాశారు. ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో మహారాష్ట్రకు సర్వీసులను తగ్గిస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, దీనిపై ఎప్పటికప్పుడు మహారాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు.
బెళగావి ప్రాంతం కర్ణాటకలోనే ఉన్నప్పటికీ ఇక్కడ మరాఠీల సంఖ్య అధికంగా ఉంటుంది. భాషా ప్రాతిపదికన రాష్ర్టాల ఏర్పాటు సమయంలో బెళగావితోపాటు, పలు సరిహద్దు గ్రామాలను తప్పుగా కర్ణాటకకు అప్పగించారని మహారాష్ట్ర వాదిస్తున్నది. అయితే దీనిని కర్ణాటక ప్రభుత్వం తిరస్కరిస్తూ వస్తున్నది. ఆ ప్రాంతం తమదే అని గట్టిగా చెప్పేందుకు ఆ ప్రభుత్వం అక్కడ సువర్ణ విధాన సౌధను నిర్మించి ఏడాదికి ఒకసారి శాసనసభ సమావేశం నిర్వహిస్తున్నది. 1966లో మహాజన్ కమిషన్ కర్ణాటకకు అనుకూలంగా రూలింగ్ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని తిరస్కరించిన మహారాష్ట్ర సర్కారు.. 2004లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి కేసు పెండింగ్లో ఉన్నది.