న్యూఢిల్లీ, ఆగస్టు 17: వచ్చే నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (67)ను తమ అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎంపిక చేసినట్టు కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ ఆదివారం వెల్లడించింది. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్‌కు ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో పాటు రాజకీయాల్లో విశేష అనుభవం ఉంది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ర్టానికి చెందిన అభ్యర్థిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తాము విపక్షాలతో కూడా సంప్రదిస్తున్నామని, ఉప రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించాలని వారిని కోరుతున్నామని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో 786 మంది సభ్యులుండగా, ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి కనీసం 394 ఓట్లు అవసరం. అయితే ఎన్డీఏ కూటమికి రెండు సభల్లో కలిపి 422 ఓట్లు ఉన్నాయి. దీంతో ఆ అభ్యర్థి ఎన్నిక నల్లేరు మీద బండిగా భావిస్తున్నారు. కాగా, ఇంతకుముందు ఉప రాష్ట్రపతిగా పనిచేసిన జగదీప్ ధన్‌ఖడ్ కూడా ఆ పదవికిలోకి రాకముందు గవర్నర్‌గా పనిచేశారు. ఈ ఎన్నికకు నామినేషన్ దాఖలుకు ఆగస్టు 21 ఆఖరు తేదీ. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖ నేతలు సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని పోటీకి దింపేందుకు సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కార్యాలయంలో సమావేశం కానున్నట్టు ఇండియా కూటమి తెలిపింది.
ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ 1957, అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించారు. తమిళనాడులో ప్రభావవంతమైన గౌండర్ సామాజిక వర్గానికి చెందిన ఈ ఓబీసీ నేతకు ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో పాటు రాజకీయాల్లో సుమారు 40 ఏండ్ల అనుభవం ఉంది. తమిళనాడు మోదీగా ఆయనను పిలుస్తారు. 2003 నుంచి 2006 వరకు ఆయన తమిళనాడు బీజేపీ అధ్యక్షునిగా పనిచేశారు. విశేష రాజకీయ అనుభవం ఉన్న ఆయన తమిళనాడులో రెండు సార్లు ఎంపీగా చేశారు. మహారాష్ట్ర గవర్నర్‌గా 2024, జూలై 31న బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2023 ఫిబ్రవరి 18 నుంచి 2024 జూలై 30 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా, 2024 మార్చి నుంచి జూలై వరకు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా 2024 మార్చి నుంచి ఆగస్టు వరకు పనిచేశారు.