ముంబై , డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : హర్షల్కుమార్ క్షీర్సాగర్.. ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శంభాజీనగర్‌లో నడిచే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో తాత్కాలిక కంప్యూటర్ ఆపరేటర్. 23 ఏండ్ల అతని జీతం రూ.13 వేలు. హర్షల్ సంస్థలో భారీ మోసానికి తెరతీసి రూ.21 కోట్లను కొట్టేశాడు. పరారీలో ఉన్న హర్షల్ ఆ సొమ్ముతో లగ్జరీ కార్లు, బైక్, ప్రియురాలికి 4బీహెచ్‌కే ఫ్లాట్ కొని జల్సాలు చేశాడు. సంస్థ ఈ-మెయిల్ అడ్రస్‌ను పోలి ఉండేలా మరో నకిలీ ఈ మెయిల్‌ను సృష్టించి, సంస్థ పాత లెటర్‌హెడ్‌ను ఉపయోగించి ప్రస్తుత ఈ-మెయిల్ చిరునామా మార్చాలంటూ బ్యాంక్‌కు లేఖ రాశాడు. వారు మార్చడంతో బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఓటీపీలు కొత్త ఈ-మెయిల్‌కే వచ్చేవి. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించి జూలై 1 నుంచి డిసెంబర్ 7 వరకు రూ.21.6 కోట్లను 13 బ్యాంక్ ఖాతాలకు తరలించాడు. రూ.1.2 కోట్లతో బీఎండబ్ల్యూ కారు, రూ.1.3 కోట్లతో ఎస్యూవీ, 32 లక్షలతో బీఎండబ్ల్యూ బైక్, గర్ల్‌ఫ్రెండ్‌కు 4 బెడ్రూంల ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. వజ్రాలు పొదిగిన సన్ గ్లాసెస్‌ను, జత గాజులను ఆర్డర్ చేశాడు. దీని వెనుక ఇతర సిబ్బంది హస్తం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అతని సహోద్యోగి యశోదశెట్టి, ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.