Devendra Fadnavis | ముంబై: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అనూహ్య విజయం కారణంగా ఆ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చునని అంచనా వేస్తున్నారు. దీనిపై ఫడ్నవీస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎవరన్నది తమ కూటమిలోని మూడు పార్టీలు నిర్ణయిస్తాయన్నారు.
మూడు పార్టీల నేతలు సమావేశం అవుతారని హోం మంత్రి అమిత్ షా కూడా చెప్పారన్నారు. కాగా, ఫడ్నవీస్‌కు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇంకా 20 సీట్లు మాత్రమే అవసరం. ఈ పరిస్థితుల్లో కూటమి పార్టీలైన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు ముఖ్యమంత్రి పీఠాన్ని డిమాండ్ చేసే పరిస్థితిలో లేవు. అయితే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకే సీఎం పదవి దక్కాలన్న ఫార్ములా ఏదీ లేదని సీఎం షిండే వ్యాఖ్యానించడం గమనార్హం.