ముంబై : మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయం కోసం మహాయుతి, ఎంవీఏ కూటముల పోరాటం తుది అంకానికి చేరుకుంది. ముఖ్యంగా మరాఠ్వాడాలో మహాయుతి కూటమికి పరీక్ష ఎదురుకానుంది. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడం, మరాఠా రిజర్వేషన్ల అంశం, ప్రాంతీయ పార్టీలను చీల్చడం వంటివి అధికార కూటమికి ప్రతికూలంగా మారాయి. అయితే లడ్కీ బహిన్ వంటి సంక్షేమ పథకాలు, అయోధ్య రామాలయం వంటివాటిపై సానుకూలత కనిపిస్తున్నది.
రాష్ట్ర జనాభాలో 28 శాతం ఉన్న మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో కోటా కోసం పోరాడుతున్న మనోజ్ జరాంగే పాటిల్ ఈ ప్రాంతానికి చెందినవారే. మరాఠా యువతలో ఆయనకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఫాలోయింగ్ కనిపిస్తున్నది. బైక్‌లపై ‘యోధ’ పాటిల్ ఫొటోలతో కూడిన స్టిక్కర్లతో దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో ఆయన స్పష్టంగా చెప్పలేదు. కానీ మరాఠాలకు రిజర్వేషన్లు ఇవ్వనివారిని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. దీని ప్రభావం అధికార కూటమి బీజేపీ-శివసేన-ఎన్సీపీలపై ప్రతికూలంగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మరాఠా యువతలో అధికార మహాయుతి కూటమిపై ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే, మరాఠా నేతలు అన్ని పార్టీల్లోనూ ఉన్నందువల్ల వీరి ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని కొందరు చెప్తున్నారు.
కరువు పీడిత ప్రాంతంలో పత్తి, సోయాబీన్ వంటి పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రస్తుత మహాయుతి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వీరు ప్రశంసిస్తున్నారు. మహిళలకు నగదు బదిలీ పథకం ప్రయోజనకరంగా ఉందంటున్నారు. ప్రైవేట్ ఉద్యోగి సునీల్ గైక్వాడ్ మాట్లాడుతూ, అయోధ్యలో రామాలయం నిర్మాణం, జమ్ము కశ్మీరుకు ప్రత్యేక హోదాను కల్పించిన అధికరణ 370 రద్దు వంటివాటివల్ల తాను బీజేపీకి గట్టి మద్దతుదారుగా మారానని చెప్పారు. అయితే, ఓ రైతుగా తాను చాలా ఇబ్బందులు పడుతున్నానన్నారు. సోయాబీన్‌కు లభించిన ధర చాలా తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరాఠ్వాడా ఓటర్లపై ప్రాంతీయ పార్టీల చీలికల ప్రభావం కూడా ఉంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇష్టపడే రైతులు కూడా శివసేనను ఆయన చీల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తాము సంప్రదాయబద్ధంగా శివసేన మద్దతుదారులమేనని, అయితే షిండే సొంతంగా వేరొక పార్టీని ఏర్పాటు చేసుకుని ఉండవలసిందని అంటున్నారు. అవిభాజ్య శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేయడాన్ని ఖండిస్తున్నారు. మరాఠ్వాడాలోని 46 శాసనసభ నియోజకవర్గాల్లో 16 స్థానాల చొప్పున షిండే నేతృత్వంలోని శివసేన, ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పోటీ చేస్తున్నాయి. ఈ రెండిటిలో ఏ పార్టీవైపు ఓటర్లు మొగ్గుచూపుతారనేదానిపై వాటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.