ముంబై : మరాఠా రిజర్వేషన్ రగడ (Maratha Reservation Row) మహారాష్ట్రను ఊపేస్తున్న క్రమంలో ఈ అంశంపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని బీద్‌లో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనలను ఫడ్నవీస్ ఖండించారు. హింసను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని హెచ్చరించారు.
మరాఠాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందని, ఈ దిశగా ఈరోజే కొన్ని నిర్ణయాలు వెలువడతాయని, కానీ కొందరు హింసను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి శక్తులను ఉపేక్షించేంది లేదని ఆయన పేర్కొన్నారు. బీద్ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఈ ఘటనలకు బాధ్యులను గుర్తించామని, ప్రజలను సజీవ దహనం చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించడం సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించిందని అన్నారు. ఇది తీవ్ర సంఘటన అని, అవసరమైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేస్తామని ఫడ్నవీస్ చెప్పారు. శాంతియుత నిరసనలు చేపట్టే వారిపై ఎలాంటి చర్యలు ఉండబోవని స్పష్టం చేశారు.
Read More :