ముంబై: మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో విభేదాలు మరోసారి బహిరంగమయ్యాయి. ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన మిత్రపక్షమైన బీజేపీపై విమర్శలు గుప్పించారు. పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో ఆయన తన మామ శరద్‌పవార్‌తో కుమ్మక్కయ్యారని బీజేపీ విమర్శిస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్రంలో 2012లో జరిగిన రూ.70 వేల కోట్ల ఇరిగేషన్ కుంభకోణంపై మీడియా ప్రశ్నించగా ఆయన సహనాన్ని కోల్పోయారు.
తనపై ఈ స్కామ్‌పై ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు తనతో పాటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నారని ఆయన బీజేపీని ఉద్దేశించి పేర్కొన్నారు. ‘మీకు తెలుసు రూ.70 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు కొందరు ఆరోపణలు చేశారు. అయితే అలా ఆరోపణలు చేసిన వారు నాతో పాటే ప్రభుత్వంలోనే కూర్చుని ఉన్నారు’ అని పేర్కొన్నారు.