ముంబై : కొవిడ్-19 కేసులు అనూహ్యంగా పెరగుతున్న క్రమంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇతరుల జీవితాలకు ముప్పుగా పరిణమిస్తున్న వారిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. మహమ్మారిని వ్యాప్తి చేసే కరోనా ఏజెంట్లుగా తయారుకావద్దని కోరారు. కరోనా థర్డ్ వేవ్ మహారాష్ట్రలో వ్యాప్తి చెందుతున్నదని ఈసారి ఇన్ఫెక్షన్ రేటు చాలా అధికంగా ఉందని ఆయన హెచ్చరించారు.
థర్డ్ వేవ్ తీవ్రతపై చర్చించడం మాని దీన్ని కట్టడి చేసేందుకు పూనుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వైద్యారోగ్య మౌలిక వసతులపై పెను ఒత్తిడి నెలకొనే ప్రమాదకర పరిస్ధితికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో లాక్‌డౌన్‌తో అంతటా షట్‌డౌన్ విధించాలని తాము కోరుకోవడం లేదని, చట్టాలు, నియంత్రణలు ఈ సవాళ్లను అధిగమించేందుకు సాయపడవని వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్‌ను తుదముట్టించేందుకు ప్రతి పౌరుడూ ఆరోగ్య శాఖ నిబంధనలను కఠినంగా పాటించాలని కోరారు. జీవితం, జీవనోపాధిని ఆపేందుకు బదులు వైరస్ చైన్‌ను తెంపే కృతనిశ్చయంతో కరోనా నిబంధనలను పాటిస్తూ ముందుకువెళ్లాలని సీఎం ఠాక్రే పిలుపు ఇచ్చారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులపై కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.