Maharashtra | మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ వీడినట్లే కనిపిస్తోంది. శివసేన నేత ఏక్నాథ్ షిండే వెనక్కి తగ్గడంతో ముఖ్యమంత్రి పదవి బీజేపీకే దక్కడం ఖాయమని అనిపిస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని షిండే చెప్పిన వ్యాఖ్యలతో ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కానున్నట్లు తెలుస్తోంది. అయితే రేపు ఢిల్లీలో జరగబోయే మహాయుతి నేతల కీలక సమావేశంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను మహారాష్ట్రలో వర్కవుట్ చేయనున్నారు. ఇందులో బీజేపీ నేతకు ముఖ్యమంత్రి పదవి దాదాపు ఖాయమైనట్లే తెలుస్తోంది. ఇక మహాయుతి కూటమిలోని ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలకు రెండు డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయి. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో 288 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 233 సీట్లతో భారీ విజయం సొంతం చేసుకుంది. 132 సీట్లతో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో తమకే ముఖ్యమంత్రి పదవి కావాలని బీజేపీ నేతలు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలిపారు. కానీ షిండే మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడంతో మహారాష్ట్ర సీఎం పీఠంపై ఎవరు కూర్చుంటారనే ఉత్కంఠ నెలకొంది. కానీ ఇవాళ థానేలో షిండే మాట్లాడిన దాని ప్రకారం ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఏక్నాథ్ షిండే తెలిపారు. ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్ణయమే ఫైనల్ అని పేర్కొన్నారు. బుధవారం థానేలో ఆయన నివాసంలో షిండే మీడియాతో మాట్లాడుతూ.. వాళ్ల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెప్పారు. అందుకే తాను సీఎంగా ఏనాడూ ప్రవర్తించలేదని.. ఒక సామాన్యుడిలాగే ప్రజల్లో తిరిగానని తెలిపారు. తాను సామన్య రైతు కుటుంబం నుంచి వచ్చానని, పేదల కష్టాలు, బాధలన్నీ తెలుసునని అన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశానని పేర్కొన్నారు. బాల్ థాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని అన్నారు. మహారాష్ట్ర అభివృద్ధే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.