Devendra Fadnavis : మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ క్యాంపస్‌లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మత మార్పిడుల అంశంపై ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటన అత్యంత తీవ్రమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. నాసిక్‌లోని టీసీఎస్ సంస్థలో మహిళా ఉద్యోగుల్ని కొందరు సీనియర్లు లైంగికంగా వేధించడంతోపాటు, బలవంతంగా మతం మారాలని బెదిరించారు. దీంతో ఈ అంశంపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురు ప్రధాన నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. మరో మహిళ నిదా ఖాన్ పరారీలో ఉంది. ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దీనిపై మహారాష్ట్ర సీఎం స్పందించారు. ‘‘ఇది చాలా తీవ్రమైన అంశం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది ఒక ముఠాగా, ప్రణాళిక ప్రకారం చేసినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి ఘటనలో టీసీఎస్ వంటి సంస్థ ఉండటం విచారకరం. అయితే, నిందితుల విషయంలో టీసీఎస్ కఠినంగానే ఉంది. ఈ ఘటనను టీసీఎస్ తీవ్రంగా ఖండించింది. పోలీసులతో టీసీఎస్ సంస్థ సహకరిస్తోంది. టీసీఎస్‌లో ఉన్న ఇలాంటి ముఠా గుట్టును బయటపెడతాం. ఈ కేసు విచారణకు కేంద్ర దర్యాప్తు సంస్థల సాయం కోరతాం.
ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోం. దీనిపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఇది కార్పొరేట్ జిహాద్ అని తేలితే.. దీనికి గల మూలాల్ని కూడా తెలుసుకుంటాం’’ అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు తీవ్రతదృష్ట్యా ఎస్ఐడీ, ఏటీఎస్, ఎన్ఐఏ వంటి దర్యాప్తు సంస్తలు విచారణలో భాగం కావాలని కరినట్లు నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కార్నిక్ తెలిపారు.