Eknath Shinde : తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కేవలం వైద్య పరీక్షల కోసమే ఇవాళ ఆస్పత్రికి వెళ్లానని మహారాష్ట్ర కేర్ టేకర్ సీఎం ఏక్నాథ్ షిండే వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులవుతున్నా కొత్త సీఎం ఎంపికపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతున్న వేళ ఆయన ఆస్పత్రిలో చేరడం పలు అనుమానాలకు తావిచ్చింది. సీఎం పదవిని బీజేపీకి వదులుకోవడం ఇష్టం లేకనే షిండే డ్రామాలు ఆడుతున్నారని ప్రచారం జరిగింది.
ఈ క్రమంలో ఆయన ఆస్పత్రి నుంచి బయటకు రాగానే తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ప్రకటన చేశారు. కేవలం వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రిలో చేరానని చెప్పారు. కాగా మహారాష్ట్ర సీఎం ఎంపికపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతోంది. కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకే ఈసారి సీఎం పదవి దక్కుతుందని, సీఎంగా ఫడ్నవీస్ పేరును బీజేపీ ఖాయం చేసిందని వార్తలు వినిపిస్తున్నా.. ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
అయితే కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, సీఎం పదవిపై బీజేపీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఇటీవల ఏక్నాథ్ షిండే ప్రకటించడంతో ఫడ్నవీస్‌కు సీఎం పదవి పక్కా అనేది తేలిపోయింది. దీనిపై బుధవారం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బుధవారం మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై సీఎంను ఎన్నుకోనుంది. ఈ సమావేశానికి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ కేంద్ర పరిశీలకులుగా హాజరుకానున్నారు.