ముంబై, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల అంశం మరోసారి వేడెకింది. రాష్ట ప్రభుత్వం మరాఠాలకు ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు గత వారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలిపింది. అయితే మరాఠాలకు ఓబీసీ క్యాటగిరీ కింద రిజర్వేషన్లు కల్పించాలని, కుంబీ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. జాల్నా జిల్లాలోని అంబద్ తహశీల్ పరిధిలో ఒక ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంబద్ తాలూకాలో ఆదివారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధించారు. జాల్నాతోపాటు చత్రపతి శంభాజీనగర్, బీడ్ జిల్లాల్లో సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
కాగా, మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాల్నా జిల్లాలోని అంతర్వాలి సారటి గ్రామంలో గత 17 రోజులుగా చేస్తున్న నిరాహారదీక్షను ఉద్యమ నేత మనోజ్ జరాంగే సోమవారం విరమించారు. తన ఆరోగ్యంపై నెలకొన్న గందరగోళానికి తెరదింపేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నానని పేర్కొన్న ఆయన.. తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిరాహర దీక్ష జరిగిన ప్రాంతంలో రోజుకు 3-4 యువకులు రిలే దీక్షలు చేస్తారని తెలిపారు. మరోవైపు మనోజ్ జరాంగేపై పోలీసులు తొలిసారిగా కేసు నమోదు చేశారు. గత వారం బీడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన మద్దతుదారులు అనుమతి లేకుండా ఆందోళనలు చేయడం, రోడ్లను దిగ్బంధించడంపై రెండు కేసులు నమోదు చేసినట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు. ఆందోళనలు మళ్లీ ఉధృతి అయిన నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు పలువురు మనోజ్ జరాంగే సహచరులను అదుపులోకి తీసుకున్నారు.