న్యూఢిల్లీ, అక్టోబర్ 15: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. మహారాష్ట్రకు ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20న రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 23న రెండు రాష్ర్టాల కౌంటింగ్ ఉంటుంది.
మహారాష్ట్రలో 9.63 కోట్ల మంది, జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా 47 అసెంబ్లీ స్థానాలకు, వయనాడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 13న, ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ అసెంబ్లీ స్థానానికి, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి నవంబరు 20న ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్నట్టు ప్రకటించారు.
ఈవీఎంలో ఉండేవి సింగిల్ యూజ్ బ్యాటరీలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఈవీఎంలపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టత ఇచ్చారు. ఈవీఎంలు సురక్షితమైనవని, పటిష్టమైనవని ఆయన పేర్కొన్నారు. సెల్ఫోన్లా ఈవీఎంల బ్యాటరీలకు చార్జింగ్ పెట్టడం కుదరదని, వీటిల్లో ఉండేవి కాలిక్యులేటర్లలో ఉండే లాంటి సింగిల్ యూజ్ బ్యాటరీలని తెలిపారు. హెజ్బొల్లా పేజర్లను ఇజ్రాయెల్ హ్యాక్ చేసినట్టు ఈవీఎంలను సైతం హ్యాక్ చేయొచ్చన్న కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ వ్యాఖ్యలను రాజీవ్ కుమార్ కొట్టిపారేశారు. పేజర్లు కనెక్ట్ అయి ఉంటాయని, ఈవీఎంలు అలా ఉండవని పేర్కొన్నారు.
ఆత్మపరిశీలన చేసుకోండి..
కౌంటింగ్ రోజు మీడియా వ్యవహరించే తీరును రాజీవ్ కుమార్ తప్పుపట్టారు. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైతే 8:05, 8:10 నుంచే ఫలితాలు ప్రసారం చేయడం నాన్సెన్స్ అని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్‌పైనా స్వీయ ఆత్మపరిశీలన అవసరమని అన్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య నేపథ్యంలో హింసను నివారించడానికి కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.