Maharashtra Elections | ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. బుధవారం రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఆర్థిక రాజధానిలో అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు మహాయుతి, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాష్ట్రమంతా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహారాష్ట్ర ఎన్నికలు ఆరు పార్టీలతో కూడిన రెండు ప్రధాన కూ టముల మధ్య హోరాహోరీ జరుగుతున్నాయి. దీంతో పార్టీల మధ్య పొత్తులు ఫలిస్తాయా? ఓట్లు బదిలీ అవుతాయా? అనే అం శాలపై ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉండనున్నాయి. పార్టీలు సైతం ఓట్ల బదిలీ పూర్తిస్థాయి లో జరిగేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
అంతుచిక్కని ఓటర్ల మనోగతం
ఈ ఎన్నికలు శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) భవిష్యత్తుకు కీలకంగా మారాయి. దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలకు మహారాష్ట్రలో బలమైన ఓటుబ్యాంకు ఉంది. ఈసారి ఈ రెండు పార్టీల్లో చీలిక ఏర్పడటంతో ఓటర్లు ఎటువైపు ఉంటారనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ ఒక కూటమిగా, బీజేపీ, శివసేన మరో కూటమిగా అనేక ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. ఆయా పార్టీల మధ్య ఓట్ల బదిలీ సులువే. అయితే, ఎంవీఏలో భాగంగా ఉన్న శివసేన(ఉద్ధవ్)కు ఉండే హిందూత్వ ఓటు బ్యాంకు కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)కి బదిలీ అవుతుందా? మైనారిటీ, దళిత ఓట్లు ఎక్కువగా ఉండే కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ) ఓట్లు శివసేన(ఉద్ధవ్)కు పడతాయా? అనే అంశం ఎంవీఏ గెలుపోటములను ప్రభావితం చేయనుంది. ఈ స్థాయిలో కాకపోయినా మహాయుతిలో ఎన్సీపీ(అజీత్) విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రెండు కూటముల్లో క్రాస్ ఓటింగ్ భయాలు పెరుగుతున్నాయి.
చిన్న పార్టీల ప్రభావమెంత?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలు ఏమేరకు ప్రభావం చూపగలవు? ఎవరి విజయావకాశాలను దెబ్బతీయగలవు? అనే లెక్కలూ కీలకంగా మారాయి. దాదాపు 15 చిన్న పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) 239 సీట్లలో పోటీ చేస్తున్నది. 25 సీట్లపై ప్రధానంగా దృష్టి సారించామని, 6 శాతం ఓట్లు సాధించడమే లక్ష్యమని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ) ఆజాద్ సమాజ్ పార్టీ 40 స్థానాల్లో, ఎంఐఎం 16 స్థానాల్లో, హితేంద్ర ఠాకూర్ నేతృత్వంలోని బహుజన్ వికాస్ అఘాడీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మరో ఎనిమిది చిన్న పార్టీలు పరివర్తన్ మహాశక్తి కూటమిగా ఏర్పడి 111 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ పార్టీలు ప్రధానంగా ఎంవీఏ ఓట్లకు గండి కొట్టే అవకాశాలు ఉన్నాయి. 135 స్థానాల్లో బరిలో ఉన్న రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాన్ సేన(ఎంఎన్ఎస్) ప్రభావం రెండు శివసేన పార్టీలపై పడొచ్చు. ఈ పార్టీల విజయావకాశాలను అటుంచితే మహాయుతి, ఎంవీఏ అభ్యర్థుల గెలుపోటములను మాత్రం ప్రభావితం చేసే అవకాశం ఉంది.