ముంబై, నవంబర్ 19( నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఎన్నికల్లో విజయం కోసం అధికార మహాయుతి కూటమి, విపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) హోరాహోరీ తలపడుతున్నాయి.
మహాయుతి కూటమి తరపున బీజేపీ 149 స్థానాల్లో, శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎంవీఏ తరపున కాంగ్రెస్ 101 స్థానాల్లో, శివసేన(యూబీటీ) 95 స్థానాల్లో, ఎన్సీపీ(ఎస్పీ) 86 స్థానాల్లో బరిలో ఉన్నాయి. పోలింగ్‌కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. 9.70 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరి కోసం 1,00,186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నవంబరు 23న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
జార్ఖండ్‌లో బుధవారం జరిగే రెండో, ఆఖరి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో 38 సీట్లకు జరిగే ఈ ఎన్నికల్లో సీఎం హేమంత్ సొరేన్, ఆయన భార్య కల్పనా సొరేన్, విపక్ష బీజేపీ నేత అమర్ కుమార్ బౌరీ సహా 528 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ముంబై, నవంబర్ 19: మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ముందు రోజు హైడ్రామా చోటు చేసుకుంది. పాల్ఘర్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే డబ్బులు పంచుతున్నారని బహుజన్ వికాస్ అఘాడీ(బీవీఏ) కార్యకర్తలు ఆరోపించారు. ఈ ఆరోపణలను తావ్డే తిరస్కరించగా, ఎన్నికల సంఘం ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పాల్ఘర్లోని ఓ హోటల్లో మంగళవారం తావ్డే నలసోపారా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్‌తో సమావేశమై ఉన్నప్పుడు బీవీఏ కార్యకర్తలు అక్కడికి దూసుకొచ్చారు. అక్కడ తావ్డే రూ.5 కోట్ల నగదుతో రెడ్ హ్యాండెడ్‌గా తమకు పట్టుబడ్డారని వారు ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వీడియోలో బీవీఏ కార్యకర్తలు ఒక సంచిలోని నోట్ల కట్టల గురించి మాట్లాడుతుండగా, అవి తనవి కావని తావ్డే చెప్పడం వీడియోలో కనిపించింది. బీవీఏ అధ్యక్షుడు, వసాయ్ ఎమ్మెల్యే హితేంద్ర ఠాకూర్‌కు పాల్ఘర్ జిల్లాలో గట్టి పట్టు ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన వసాయ్ నుంచి, ఆయన కుమారుడు క్షితిజ్ నలసోపారా నుంచి పోటీ చేస్తున్నారు. సంచి నుంచి రెండు డైరీలను కూడా రికవరీ చేసినట్టు హితేంద్ర ఠాకూర్ ఆరోపించారు. తావ్డేను వెంటనే అరెస్ట్ చేయాలని బీవీఏ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులు హోటల్‌ను సీజ్ చేసి, తావ్డేను బయటకు తీసుకు రావడానికి ప్రయత్నించారు. తావ్డే ఘటనపై విపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి.