ముంబై,ఆగసు ్ట1 (నమస్తే తెలంగాణ): ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా తాపీగా ఫోన్లో రమ్మీ ఆడారు కాబట్టి, ఆయనకు క్రీడల పట్ల చాలా ఆసక్తి ఉందని భావించిందో ఏమో మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం.. ఆయనకు క్రీడల శాఖను కేటాయించింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావు కోకాటేను ఆ శాఖ నుంచి తప్పించి ప్రభుత్వం క్రీడా శాఖ కేటాయించింది.
మంత్రిని పదవి నుంచి తప్పించకుండా క్రీడాశాఖకు మార్చడం పట్ల విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. కోకాటే.. శాసనసభ సమావేశాలు జరుగుతుండగా ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్న వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. జంగిల్ రమ్మీని మహారాష్ట్ర అధికారిక రాష్ట్ర ఆటగా గుర్తిస్తే ఎటువంటి సమస్య ఉండదని కాంగ్రెస్ ప్రతినిధి సచిన్ సావంత్ కూడా ఎక్స్‌లో తీవ్రంగా విమర్శించారు.