పాట్నా/ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చటమే రాజకీయంగా మార్చుకొన్న బీజేపీ, మరో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అతి త్వరలో కూల్చివేస్తామని హూంకరిస్తున్నది. అనేక రాష్ర్టాల్లో తెరవెనుక దుష్ట రాజకీయం నడిపి ప్రభుత్వాలను పడగొట్టి అధికారం హస్తగతం చేస్తున్న కమలం పార్టీ, ఈ సారి మాత్రం బహిరంగంగానే బరితెగించి ప్రకటనలు చేస్తున్నది. బీహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వాన్ని అతి త్వరలో కూల్చివేస్తామని బీజేపీ నేత, ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ సవాల్ చేశారు. జేడీయూ, ఆర్జేడీల మహాఘట్బంధన్ను ముక్కలు చేస్తామని హూంకరించారు. మణిపూర్‌లో ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలను అధికార బీజేపీ శుక్రవారం తనవైపు లాగేసుకొన్నది. గతంలో అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా ఏడుమంది జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీ తనలో కలిపేసుకొన్నది. ఆ రెండు రాష్ర్టాలను జేడీయూ ముక్త్ రాష్ర్టాలుగా మార్చామని, ఇక బీహార్‌ను కూడా అలాగే మారుస్తామని సుశీల్‌కుమార్ మోదీ ప్రకటించారు. జేడీయూ కూడా బీజేపీకి దీటుగా స్పందించింది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో దేశాన్ని బీజేపీ ముక్త్ భారత్‌గా మార్చటమే తమ లక్ష్యమని ప్రకటించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఒక్కటి చేసేందుకు నితీశ్‌కుమార్ ఢిల్లీ వెళ్లనున్నారు.
ప్రతీకార కోరలు
ఇటీవల బీహార్‌లో నితీశ్‌కుమార్ ఇచ్చిన షాక్‌కు బీజేపీకి దిమ్మదిరిగిపోయింది. ఆ పార్టీతో రెండున్నరేండ్ల సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన నితీశ్ ఆర్జేడీతో 24 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి బీజేపీ నితీశ్‌కుమార్‌పై రగిలిపోతున్నది. ప్రతీకారంగా మణిపూర్‌లో అలవాటు ప్రకారం ఫిరాయింపులను ప్రోత్సహించి జేడీయూను దెబ్బ తీసింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు స్థానాల్లో గెలిచింది. వారిలో కేహెచ్ జోయ్కిషన్సింగ్, ఎన్ సనటే, మొహమ్మద్ అచబ్ ఉద్దీన్, తాంగ్జామ్ అరుణ్‌కుమార్, ఎల్ ఎం కౌటే శుక్రవారం బీజేపీలో చేరినట్టు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. 2019లో కూడా అరుణాచల్‌ప్రదేశ్‌లో జేడీయూను బీజేపీ అలాగే దొంగదెబ్బ తీసింది. ఆ రాష్ట్రంలో జేడీయూకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా, అందరినీ బీజేపీ తనలో కలిపేసుకొన్నది. బీహార్‌లో నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆయనను డమ్మీని చేయటానికి బీజేపీ ప్రయత్నించటంతో ముందుగానే మేల్కొని ఆ పార్టీకి దూరం జరిగారు నితీశ్.
బహిరంగంగానే బెదిరింపులు
శాసనసభలో సంపూర్ణ మెజారిటీ ఉన్న ఒక ప్రభుత్వాన్ని (మహాఘట్బంధన్) నిలువునా కూలుస్తామని బీజేపీ బెదిరింపులకు దిగుతున్నది. ‘అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్ జేడీయూ ముక్త్ రాష్ర్టాలు అయ్యాయి. అతి త్వరలో బీహార్‌లోని జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణాన్ని కూలుస్తాం. బీహార్‌ను కూడా జేడీయూ ముక్త్ రాష్ట్రంగా మారుస్తాం’ అని బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ సవాల్ చేశారు.
బీజేపీ ముక్త్ భారతే మా లక్ష్యం: జేడీయూ
బీజేపీ హూంకరింపులపై జేడీయూ కూడా అదే స్థాయిలో స్పందించింది. ‘2024లో దేశం బీజేపీ ముక్త్ భారత్ అవుతుంది’ అని జేడీయూ నేత రాజీవ్ రంజన్‌సింగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ దుష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉన్నదని నితీశ్ అన్నారు. విపక్షపార్టీలు కలిసికట్టుగా పోరాడితే 2024 ఎన్నికల్లో బీజేపీ 50 సీట్లకు పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. ప్రతిపక్ష నేతలను కలిసేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలిపారు.