Maha Kumbh | ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కార్యక్రమైన మహా కుంభమేళా సోమవారం ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి స్నానంతో మొదలైంది. ఈ సారి మహా కుంభమేళా భిన్నంగా ఉండనున్నది. ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా జరుగుతుంది. సాధారణంగా ప్రతి ఆరుసంవత్సరాలకోసారి అర్ధ కుంభమేళా, 12 సంవత్సరాల కోసారి కుంభమేళా జరుగుతుంది. కానీ, ఈ సారి 144 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
ఈ మహా కుంభమేళా ఎంతో ప్రత్యేకమని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు. కుంభమేళా ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో జరుగుతుందని.. కానీ, మహా కుంభమేళా మాత్రం కేవలం ప్రయాగ్‌రాజ్‌లోనే జరుగుతుంది. దాదాపు 45 రోజుల పాటు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమానికి దాదాపు 40 కోట్ల మంది హాజరవుతారని అంచనా. యావత్ భారతదేశంతో పాటు వివిధ దేశాల నుంచి భక్తులు, పర్యాటకులు ఈ ఉత్సవానికి హాజరవుతారు. దేశంలోని నలుమూలల నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చేరుకునేందుకు భారతీయ రైల్వే ఏర్పాట్లు చేస్తున్నది.
కార్యక్రమానికి హాజరయ్యే భక్తులు, పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నది. మహా కుంభ్‌కు వచ్చే ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే ప్రత్యేక సన్నాహాలు చేసింది. ఇందులో 24 గంటల వార్ రూమ్ ఒకటి. సమీపంలోని అన్ని స్టేషన్లలో సీసీకెమెరాలు, బహుభాషా కమ్యూనికేషన్ వ్యవస్థ, అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసింది. రైల్వే బోర్డు స్థాయిలో ప్రత్యేక ‘వార్ రూమ్’ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బోర్డు ప్రచార కార్యనిర్వాహక డైరెక్టర్ దిలీప్‌కుమార్ పేర్కొన్నారు. 24 గంటలు పని చేస్తుందని.. అందులో ఆపరేషన్స్, బిజినెస్, ఆర్పీఎఫ్, ఇంజినీరింగ్, విద్యుత్ విభాగాల అధికారులు కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు సమన్వయం చేస్తారని చెప్పారు.
ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలోని తొమ్మిది స్టేషన్లలో రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం 1,176 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికుల కోసం 12 భాషల్లో ప్రకటన వ్యవస్థను ప్రారంభించారు. కుంభమేళా సమయంలో పదివేల సాధారణ రైళ్లు, 3,134 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇది గత కుంభమేళా కంటే 4.5 రెట్లు ఎక్కువ. స్వల్ప దూరానికి 1,896 రైళ్లు, 706 దూర ప్రాంతాలకు, మరో 559 రింగ్ ట్రైన్స్ నడిపించనున్నట్లు రైల్వేశాఖ వివరించింది.