Indian Railway | ప్రయాగ్‌రాజ్‌లో ఫిబ్రవరి 13 నుంచి మహా కుంభమేళా జరుగనున్నది. ప్రస్తుతం అధికార యంత్రాంగమంతా ఏర్పాట్లలో బిజీగా ఉన్నది. మహా కుంభమేళాకు వెళ్లేందుకు రైలులో ‘టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు’ అనే వార్త తెగ ప్రచారం అవుతున్నది. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టింది. ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వనున్నట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని.. తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ రైల్వేమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మహా కుంభమేళా సందర్భంగా ఉచిత ప్రయాణం కల్పిస్తామని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని.. ఆ వార్తలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. టికెట్ లేకుండా ప్రయాణించడం నేరమని చెప్పింది. చెల్లుబాటయ్యే టికెట్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని చెప్పింది.
భారతీయ రైల్వే నియమ, నిబంధనల ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణించడం నేరమని స్పష్టం చేసింది. మహా కుంభమేళతో పాటు మరో ఇతర సందర్భాల్లోనూ ఉచిత ప్రయాణానికి ఎలాంటి నిబంధనలు లేవంటూ క్లారిటీ ఇచ్చింది. మహా కుంభమేళా సందర్భంగా ప్రయాణం సాఫీగా సాగేందుకు భారతీయ రైల్వేశాఖ కట్టుబడి ఉందని పేర్కొంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. ప్రత్యేకించి ప్రయాణ సమయంలో అదనపు టికెట్ కౌంటర్లు తదితర అవసరమైన సౌకర్యాలను రైల్వేశాఖ ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే, కుంభమేళాకు వెళ్లే వారంతా రైలు టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని.. ఈ మేరకు రైల్వేశాఖ ప్రతిపాదనలను కేంద్రానికి పంపినట్లుగా పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. కేంద్రం ఆమోదం తెలిపితే జనరల్ కోచ్‌లో ప్రయాణానికి టికెట్లు అవసరం లేదని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ప్రయాగ్‌రాజ్‌కు 13వేల రైళ్లను నడుపబోతున్నట్లుగా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ వార్తలను రైల్వేమంత్రిత్వ శాఖ ఖండించింది.