Hussain Dalwai | న్యూఢిల్లీ, జనవరి 26: కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే మహా కుంభమేళాపై కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ మాజీ ఎంపీ హుస్సేన్ ధాల్వాయి మరోసారి నోరు పారేసుకుని వివాదం సృష్టించారు. పుణ్య స్నానం ఆచరించేందుకు దేశ నలు మూలల నుంచి ప్రజలు రావడం వల్ల మహా కుంభమేళా అపరిశుభ్రంగా మారగలదని ఆయన వ్యాఖ్యానించారు.
ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలేవీ నిర్వహించక పోవడం వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్నానాల కోసం కూడా తగిన ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని ఆయన చెప్పారు. వైద్య పరీక్షలు లేకుండా సామూహిక పుణ్య స్నానాలు చేయడం వల్ల ఆరోగ్యంగానే ఉన్న వ్యక్తులకు కూడా వ్యాధు లు సోకే అవకాశం ఉందని ఆయన అన్నారు. హుస్సేన్ వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా అభ్యంతరం వ్యక్తం చేశారు.