Maharashtra cabinet expansion | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్‌ను
విస్తరించనున్నారు. 15 మందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 15లోపు కొత్త
మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా
ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడవ్నిస్కు హోంమంత్రి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తున్నది.
శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు అనంతరం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో జూన్ 30న సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇద్దరే ప్రభుత్వాన్ని నడిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఎన్సీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల ఎన్నికలపై దృష్టి పెట్టింది. మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీలు వరుసగా విజయం సాధిస్తున్న 16 స్థానాలను గుర్తించి, తన ముద్రను వేసేందుకు మిషన్‌ను ప్రారంభించింది. లోక్‌సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తాయని, ఆయా నియోజకవర్గాల్లోని సిట్టింగ్ లోక్‌సభ సభ్యుల గెలుపునకు బీజేపీ కృషి చేస్తుందని ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు ఆయన చెప్పారు.
బారామతి నియోజకవర్గంలో సెప్టెంబర్‌లో నిర్మలా సీతారామన్ పర్యటించే అవకాశం ఉండగా.. లోక్‌సభ ఎన్నికల బాధ్యతలు అప్పగించిన కేంద్ర బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు త్వరలోనే పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బారామతి లోక్‌సభ స్థానానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నది.